టిటిడి ఆధ్వర్యంలోని తిరుపతిలో గల శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టిటిడి హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో ప్రతి ఏడాదీ అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.
సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టిటిడి శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లు చేశారు. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూలమాలలతో అలంకారాలు చేపట్టారు. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దారు.
గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవులకు గ్రాసం తినిపించారు. హైందవ ధర్మంలో గోవును ”గోమాత”గా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల భావన, నమ్మకం.
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, వేణుగానం, వేద పఠనం జరిగాయి. ఆ తరువాత టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహించారు. శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.