ప్రముఖ శ్రీవైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి అవతార మహోత్సవం ఆగస్టు 28, 29వ తేదీల్లో తిరుమలలో ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి సన్నిధిలో ఈ రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి తిరుమలలో జన్మించారు. ఈయన శ్రీవేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం చేసేవారు. శ్రీభగవద్రామానుజుల వారికి మేనమామ, గురుతుల్యులు అయిన శ్రీ తిరుమలనంబి ఆయనకు రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
అవతారమహోత్సవాల సందర్భంగా ఆగస్టు 28న తాతాచార్య వంశీకుల ఆధ్వర్యంలో వాల్మీకి రామాయణ పారాయణం, వేదపారాయణం చేస్తారు. ఆగస్టు 29న అవతార మహోత్సవాల సందర్భంగా తాతాచార్య వంశీకులకు సన్మానం, శ్రీ తిరుమలనంబి సేవలు, కైంకర్యాలపై సదస్సు జరుగనుంది. 24 మంది శ్రీవైష్ణవ పండితులు ఈ సదస్సులో పాల్గొని ఉపన్యసిస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఇన్‌చార్జి ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.