ఆషాఢమాసం...గోరింటాకు...ఈ రెండింటికీ విడదీయలేని బంధం ఉంది. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి. అందుకు సరైన శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరిం టాకు పెట్టుకొని తీరాలనేది పూర్వకాలం నుండి పెద్దలు చెబుతున్న మాట. ఎందు కంటే... వర్షాలు ఆషాఢంలో ఊపందు కుంటాయి. అప్పటి వరకూ ఎండ వేడిమితో అల్లాడిన మనం కాస్త హాయిగా ఫీలయ్యే మాసం ఇది... దీంతో చిన్నా పెద్దా ఏదో కారణం చెబుతూ వానలో తడిసేందుకు ఇష్టపడతారు.
అంతేకాకుండా వర్షాలు క్రమేపీ ఊపందుకుంటాయి. వ్యక్తిగత పనుల కారణం చేత కూడా తరచూ వర్షపు నీటిలో నానుతుంటాం. చెరువుల్లో, కాలువల్లో కొత్త నీరు వచ్చి చేరుతుంది. పొలం మడుల్లో నీరు చేరుతుంది. కొత్త నీరు కుళ్లిన చెత్త, కీటకాలతో నిండి ఉంటుంది. వర్షాలు బాగా పెరిగి నీరు పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకూ ఈ నీరు శుద్ధి అవదు. పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు...చెరువుల్లో స్నానాలు చేసేవారు...ఇలా ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడప కుండా రోజుని దాటలేరు. దీంతో పలు వ్యాధులు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఎక్కువగా చర్మవ్యాధులకు గురవుతాం, గోళ్లు దెబ్బతినడం వంటి సహజ మార్పులు గమనిస్తాం.
గోరింటాకు ఇలాంటి వ్యాధుల్ని దరిచేరనీకుండా కొంతవరకూ ఆపుతుంది. గోరింటాకులో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఈ మాసంలో వాతా వరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అను గుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింటాకు.
వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు... పూలు,వేళ్ళు ,బెరడు,విత్తనాలు...అన్నీ ఔషధ యుక్తాలే ! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు...అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టు కోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.
ఆషాఢంలో కొత్త పెళ్లికూతుళ్ళు పుట్టింటికి చేరుకుంటారు. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. గోరింటాకు ఆడపిల్లల చేతులకు కోమలత్వాన్ని తెచ్చిపెడుతుంది.