శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ అలంకారాలలో మలయప్పస్వామి భక్తులను అలరిస్తున్నారు.
సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్ప
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతారం – మాయా మోహ నాశనం
ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.
గరుడ వాహనం
సాయంత్రం 6:30 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.