సరస్వతీ పుష్కరాలకు సిద్ధమవుతున్న కాళేశ్వరం

గోదావరి, ప్రాణహిత నదులు కలిసే పవిత్రమైన కాళేశ్వర క్షేత్రంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మే సరస్వతీ నదికి రానున్న నెలలో పుష్కరాలు జరగనున్నాయి. 

సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది. రూ. 25కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో  ఈ ఏడాది మే 15వ తేదీ  నుంచి 26వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతీ నది పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. సరస్వతీ పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండగ. ఇది సాధారణంగా ప్రతి 12ఏళ్లకు ఒకసారి వస్తుంది. 

2025 మే 14వ తేది రాత్రి 10.34గంటలకు  బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుంది. మే 15న సూర్యోదయంతో పుష్కర పుణ్యస్నానాలు ప్రారంభం అవుతాయి. పుష్కరాలు మే 26వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పుష్కరాల నిర్వహణ తేదీలను కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు నిర్ణయించారు. ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. సరస్వతీ నది త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా భావిస్తారు. పుష్కర సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.