కలియుగదైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఒక అపూర్వమైన అనుభవం. స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివితీరదు మనకు.
ఏయే మార్గాల్లో దర్శించుకోవచ్చు?
తిరుమల వెళ్ళిన భక్తులు మూడు మార్గాల్లో దర్శనం పొందవచ్చు. ధర్మదర్శనం, 300రూపాయల ప్రత్యేక దర్శనం, కాలిబాటన వచ్చే వాళ్ళ కోసం దివ్యదర్శనం వెంకన్న దర్శనానికి వున్న మార్గాలు. అయితే స్థోమత ఉన్నవాళ్ళకోసం 10000 రూపాయలు చెల్లిస్తే లభించే అపురూపమైన దర్శనం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తోంది. ఈ టిక్కెట్ తీసుకుంటే వీఐపీ దర్శనంతో పాటు కులశేఖర పడి వరకూ వెళ్ళి స్వామిని తనివితీరా వీక్షించే భాగ్యం కలుగుతుంది.
అయితే అందరూ ఇంత సొమ్ము ఖర్చుచేయలేరు కదా? అలాంటివారు స్వామిని దగ్గరగా ఉండి చూడలేరా? అంటే చూడొచ్చు, స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవల్లో పాల్గొనడం ద్వారా. సేవలలో నిత్యసేవలు, వారానికి ఒకసారి చేసే సేవలు ఉంటాయి. అయితే ఈ సేవలకు మనకు అనుమతి లభించడం అనేది మన ప్రాప్తాన్ని బట్టి, స్వామి కరుణను బట్టి ఉంటుంది.
తిరుమల స్వామివారికి చేసే రోజువారీ సేవలు
ప్రతీ రోజూ తెల్లవారు ఝామున సుప్రభాత సేవతో స్వామివారికి మేలుకొలుపు పలికి, పుష్పాలంకరణ చేసి, సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఒక వైపు "అంగప్రదక్షిణ" చేసేవారిని వదులుతారు. అర్చకులు శాత్తుమురై చేస్తారు. ఆపైన ధర్మ దర్శనం మొదలవుతుంది. అంటే సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, అంగప్రదక్షిణం అనే నాలుగు సేవలు తెల్లవారుజామునే మొదలవుతాయి. ఈ సేవలన్నింటికీ కూడా మనకు అనుమతి దొరకడం అంత సులభం కాదు.
సుప్రభాత సేవ
సుప్రభాత సేవలో పాల్గొన్న భక్తులు సుప్రభాతం జరిగినంతసేపూ స్వామి ఎదురుగానే ఉంటారు.కానీ తెరవేసి స్వామికి మేలుకొలుపు చేస్తారు. సుప్రభాతం పఠించే అర్చకస్వాములు, భక్తులు తెరకు ఈవల వుంటారు. మేలుకొలుపు అయిన తరువాత దర్శనం కోసం వదులుతారు. దర్శనం మెల్లగా సాగుతుంది. మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకోవచ్చు. ఎవరూ తోయడం అదీ వుండదు.
తోమాల సేవ
సుప్రభాత సేవ పూర్తయిన తరువాత తోమాల(పువ్వులు)సేవకు వచ్చిన భక్తులను పంపిస్తారు. పుష్పమాలాలంకృతులైన స్వామివారిని కన్నులారా చూసి తరిస్తారు భక్తులు.
సహస్రనామార్చన
తోమాలసేవ పూర్తియిన తరువాత అర్చన సేవలో పాల్గొనేభక్తులను పంపిస్తారు. వీరు స్వామికి సహస్రనామాల పూజచేస్తున్నంతసేపూ స్వామి ఎదుటే ఉంటారు. తరువాత దర్శనానికి వదులుతారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు చాలా భాగ్యవంతులు అనిపిస్తుంది.
అంగప్రదక్షిణ
సుప్రభాతం, తోమాలసేవ, అర్చనకు నమోదుచేసుకున్న భక్తుల దర్శనాలు ఒకవైపు సాగుతుండగా అంగప్రదక్షిణలలో పాల్గొనే భక్తులు సుమారు అర్ధరాత్రి 2గంటల సమయంలో పుష్కరిణిలో స్నానం చేసి,తడిబట్టలతో క్యూలో నిలబడి వుంటారు. సమయానికి వాళ్లను ఆలయానికి మూడు వైపులా అంగ ప్రదక్షిణలు చేయించి దర్శనానికి పంపుతారు ఈ దర్శనం కూడా చాలా సాఫీగా జరుగుతుంది. చాలా తక్కువ ఖర్చుతో లభించేది అంగప్రదక్షిణ. తక్కువ ఖర్చుతోనే స్వామి చాలా దగ్గరగా చూపించే సేవ. ఈ సేవకు టిక్కెట్లు ఆన్లైన్లో గానీ, ఇది ముందు రోజు క్యూలో నిలుచుని గానీ తీసుకోవాలి. అంగప్రదక్షిణ సేవకు ఆడా మగా కలిపి మొత్తం 750 టిక్కెట్లు ఇస్తారు.
శుక్రవారం నాడు చేసే సేవల్లో కొద్దిగామార్పు ఉంటుంది. అర్చన సేవ వరకు ఏకాంతం లో చేసి స్వామికి అభిషేకం చేస్తారు. ఈ రోజున పునుగు గిన్నె, కస్తూరి గిన్నె, పూరాభిషేకం, వస్త్రాలంకరణ సేవ అనే నాలుగు సేవలు జరుగుతాయి. స్వామి సేవలన్నింటిలోను చాలా విశిష్టమైంది శుక్రవార అభిషేకం. శని,ఆదివారాల్లో ప్రత్యేకమైన సేవలు ఏవి వుండవు.
ప్రత్యేక వారపు సేవలు
సోమవారం - తిరుమంజన సేవ
ప్రతీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్వామివారికి తిరుమంజనసేవ నిర్వహిస్తారు. ఆ రోజు మలయప్ప స్వామిని మంటపంలో వేంచేపు చేసి,చతుర్దశ కలశాలతో పూజ చేస్తారు. ఈ 14 కలశాలలో ఏడింటిలో నువ్వుల నూనె, పాలు, పెరుగు, నెయ్యి, అక్షతలు, దర్భలు, పంచగవ్యాలు, మిగతా ఏడింటిలో శుద్దోదకం సిద్ధంచేసి శ్రీ, భూ, నీలా,పురుష, నారాయణ సూక్తము లతో స్వామికి తిరుమంజనం చేస్తారు. ఆ తరువాత హోమం చేస్తారు. ఆపై సేవలో పాల్గొన్న వారికి దర్శనం వుంటుంది. సేవలో పాల్గొన్నవారికి వస్త్ర బహుమానం ఇస్తారు.
మంగళవారం - అష్టదళ పాదపద్మారాధనం
అష్టదళ పాదపద్మారాధన సేవ ప్రారంభించడానికి కారణం ఒక ముస్లిం భక్తుడికి స్వామివారి మీద వున్న అచంచలమైన భక్తి. మంగళవారం రెండు గంటల తరువాత ఈ సేవ జరుగుతుంది. ఆ ముస్లిం భక్తుడు సమర్పించిన 108 బంగారు తామర పువ్వులతో స్వామివారికి అష్టోత్తర నామాలతో అర్చన చేస్తారు. ఆ తర్వాత లక్ష్మీ, పద్మావతి అమ్మవార్లకు కూడా అర్చన చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు భక్తులు బంగారు వాకిలి, కులశేఖర పడి మధ్యలో కూర్చొని స్వామి వారిని చూసే భాగ్యానికి మురిసిపోతూ, స్వామిని చూస్తూ వుంటారు.
బుధవారం - సహస్ర కలశాభిషేకం
సహస్ర కలశాభిషేకం భోగ శ్రీనివాసమూర్తికి చేస్తారు. మలయప్ప స్వామి కూడా వుంటారు. భోగ శ్రీనివాసమూర్తిని బంగారు వాకిలి బయట వుంచి, ఆయన పాదాలకు ఒక పట్టు వస్త్రము కొస కట్టి రెండవ అంచు మూలవర్ల కటిహస్థానికి కడతారు. అంటే కార్యక్రమం ఆయనకే చేస్తున్నట్టుగా అన్నమాట. ఆపై 1008 కలశాలలో తెచ్చిన పరిమళ తీర్థంతో పాటు 8 పరివార కలశాలలో తీర్థం పంచ సూక్తాలతో, పంచ శాంతి మంత్రాలతో స్వామికి అభిషేకం చేస్తారు. ఆ పై ఒక బంగారు కలశంలోని జలాలు వేద మంత్రాలతో, మంగళ వాయద్యాలతో ఆనంద విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణగా తీసుకొని వెళ్లి మూలవర్ల పాదాలపై జల్లి, అర్చన చేస్తారు. ఈ సమయంలో తెర కట్టివుంచుతారు. సేవ పూర్తయిన తరువాత భక్తులకు దర్శనం ఇస్తారు.
గురువారం - తిరుప్పావడ సేవ
ఇది ఒక అద్భుతమైన సేవ. ఈ రోజు ఉదయపు సేవ అవగానే స్వామివారి అలంకరణలు అన్నీ తీసివేసి, స్వామి వారిని అంగవస్త్రం, దోతి లో మాత్రమే వుంచి, స్వామి వారి తిరునామం, కస్తూరి ని బాగా తగ్గిస్తారు. అంటే స్వామివారి నేత్రదర్శనం మనకు కలుగుతుంది. మరి అంత శక్తి వున్న స్వామి చూపు మానవ మాత్రుడు భరించగలడా. అంచేత తిరు పావడ సేవ చేస్తారు.
బంగారు వాకిలి దగ్గర జయవిజయుల తర్వాత ఒక పెద్ద బంగారు దీర్ఘ చతుర్భుజ ఆకారంలో వున్న పాత్ర వుంచుతారు. 6 అడుగుల పైన పొడుగు, రెండు మూడు అడుగుల వెడల్పు, అంతే లోతు వున్న ఈ పాత్రను చిత్రాన్నం(పులిహోర) నింపి దాని మీద పాయసం, జిలేబి, తేన్ తోళ వుంచుతారు..
తరువాత మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి తిరునామాన్ని మళ్ళీ పూర్తిగా దిద్దుతారు. అలా స్వామి చూపు ఈ నైవేద్యం మీద పడుతుంది , దీనినే పావడ అంటారు.
ఇది జరుగుతున్నంత సేపు భక్తులు గరుడా ల్వార్ కు అటూఇటు వున్న స్థలంలో వుండి ఇదంతా చూస్తూ వుంటారు. ఆ తరువాత దర్శనానికి వదులుతారు.
అన్నట్టు ఈ సేవలో పాల్గొన్న వారికి చాలా ప్రసాదాలు ఇస్తారు.. ఎప్పుడూ చూసే లడ్డు వగైరా మాత్రమే కాకుండా, తిరుమలలో స్వామి ప్రసాదంగా పెద్ద జిలేబి ఈ ఒక్కసేవలో మాత్రమే లభిస్తుంది.
శుక్రవారం – అభిషేకం- నిజపాద దర్శనం
శుక్రవారంరోజున అభిషేకం, నిజపాద దర్శనం అనే రెండురకాల సేవలు జరుగుతాయి.గురువారం నాడు స్వామి నేత్రదర్శనం తరువాత అభిషేకానికి స్వామి తయారుగా వున్నారు. ఈ రోజు ఉదయపు సేవలు భక్తులు లేకుండా చేసేసి..అభిషేకం చేస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, చందనం, పునుగు తైలం చుక్కలు ఇలాంటి వాటితో నిండిన ఒక వెండి పాత్ర ఇస్తారు. అందరూ ఆనంద విమానం చుట్టుకొని వచ్చి బంగారు వాకిలి దగ్గరకు చేరాక ఇవి తీసుకుని, ఆకాశ గంగ జలాలు తెచ్చి, పంచ సూక్తాలు చేస్తూ స్వామిని అభిషేకిస్తారు. వక్షస్థల లక్ష్మీ అమ్మవారిని గంధంతో అభిషేకిస్తారు.
తిరుమల స్వామివారికి మరిన్ని సేవలు
వసంతోత్సవం, పవిత్రోత్సవం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇలా కొన్ని సేవలు ఆయా ప్రత్యేక మాసాల్లో జరుగుతాయి.
ఇకపోతే ఈ సేవల్లో పాల్గొనే పద్దతి. దేవస్థానం వారు ప్రతీ నెల ఒకరోజు ఆ నెలలో అవకాశం వున్న సేవలు అన్నీ ttdonlime Website ద్వారా మనకు తెలియచేస్తారు. మనం మనకు కావల్సిన సేవ, రోజు ఎంచుకో వాలి. తరువాత వచ్చే డ్రా లో మనపేరు వుంటే మనకు తెలియచేస్తారు.
దర్శనానికి రెండో పద్ధతి
ప్రతీ రోజూ మరుసటి రోజున అవకాశం వున్న సేవల వివరాలు CRO ఆఫీస్ కు ఎదురుగా వున్న విజయా బ్యాంక్ లో ప్రదర్శిస్తారు. అక్కడే క్యూలో వుండి, మనకు కావాల్సిన సేవ కోసం దరఖాస్తు ఇస్తే 6 గంటలకు లాటరీలో మన పేరు వుంటే మనకు మొబైల్ లో మెసేజ్ వస్తుంది. వెంటనే వెళ్లి డబ్బులు కట్టాలి.