అమరావతిలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం

 

వెంక‌ట‌పాలెం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి క‌ల్యాణం క‌న్నుల పండువ‌గా జరిగింది. భారీ ఏర్పాట్ల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు. 

స్వామివారి కళ్యాణోత్సవ క్రతువు ఇలా సాగింది….

విశ్వక్సేన ఆరాధన : 

విశ్వక్సేనుడు శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వసైన్యాధిపతి. స్వామివారి కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు, ఊరేగింపు ముందు ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తారు.

శుద్ధి – పుణ్యాహవచనం :

కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమకుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లుతారు. ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ.

అంకురార్పణ :

అంకురార్పణ ఏదైనా పుణ్య కార్యానికి ముందు నిర్వహించే వైదిక క్రతువు. ఈ క్రతువులో అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు.

ప్రతిష్టా బంధన :

కల్యాణంలో ఇది మరొక ప్రధాన భాగం. అర్చకులు పవిత్రమైన కంకణాలను (పవిత్ర దారాలు) స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల చేతులకు కడతారు.

అగ్ని ప్రతిష్ట :

పవిత్రమైన అగ్నిని వెలిగించి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు.

వస్త్ర సమర్పణ :

అగ్నిప్రతిష్ఠానంతరం దేవతలకు కొత్త పట్టువస్త్రాలను సమర్పించారు.

మహా సంకల్పం :

తాళ్లపాక వంశస్థులు (గత 600 సంవత్సరాల నుండి వేంకటేశ్వరుని సేవలో తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబం) అమ్మవారి తరపున కన్యాదానం చేసే ఆచారం ఇది. ఇందుకోసం మహా సంకల్పం జరిగింది.

కన్యాదానం :

కళ్యాణంలో, కన్యాదానానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ శ్రీ‌నివాసుడి గోత్రం భార‌ద్వాజ‌, మరియు అతని దేవేరులు అయిన‌ శ్రీ‌దేవి అమ్మ‌వారిది భార్గ‌వ‌స గోత్రం కాగా భూదేవి అమ్మ‌వారిది కాశ్య‌ప‌స‌ గోత్ర ప్రవరాలను అర్చ‌కులు పఠించారు.

మాంగల్య ధారణ :

వేంకటేశ్వరుడు తన ప్రియమైన భార్యలకు పవిత్ర మంగళ సూత్రాలను కట్టిన మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

వారణమాయిరం :

ఇది సాధారణంగా దక్షిణ భారత హిందూ వివాహాల సమయంలో నిర్వహించబడే ప్రముఖమైన, వినోదాత్మకమైన క్రతువు. ఇందులో స్వామివారు అతని దేవేరులు ఒకరికొకరుఎదురుగా పూల బంతులు మరియు కొబ్బరికాయలతో ఆడుకున్నారు. (ఇక్కడ దేవతల తరపున అర్చకులు  మరియు తాళ్లపాక వంశస్థులు ఈ ఆచారాన్ని నిర్వహించారు).

పూల దండ‌ల మార్పిడి

అనంతరం దేవతామూర్తులకు ఒక‌రికి ఒక్క‌రు పూలమాలలు మార్చుకున్నారు.

హారతి :

స్వామివారి కుడి వైపున శ్రీదేవి, ఎడమ వైపున భూదేవి ఆశీనులైయ్యారు. చివరగా కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి తో కళ్యాణోత్సవం అత్యంత ఘ‌నంగా ముగిసింది.

శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు. కల్యాణ వేదిక ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది.