శ్రీవారి ఆలయంలో ఘనంగా అధ్యయనోత్సవాలు


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమౌతుంది.

ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్టిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని పిలుస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

Source