తిరుమలలో విజయవంతమైన సమయ నిర్దేశిత సర్వదర్శనం

తిరుమలలో ఆరు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం విజయవంతమైంది. ఈ విధానాన్ని అర్థం చేసుకుని సహకరించిన భక్తులకు జెఈవో ధన్యవాదాలు తెలియజేశారు.

ఆరు రోజులపాటు చేపట్టిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టినట్టు జేఈఓ తెలిపారు. టిటిడి ప్రయోగాత్మకంగా అమలుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

మొదటిరోజు 12,255, రెండో రోజు 11,964, మూడోరోజు 12,920, నాలుగో రోజు 14,386, ఐదో రోజు 17,649, ఆరో రోజైన శనివారం 26,873 కలిపి మొత్తం 96,047 టోకెన్లు జారీ చేసారు. భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మార్చి రెండో వారం నుంచి పూర్తిస్థాయిలో అమలుచేస్తామన్నారు. తిరుపతిలోనూ సర్వదర్శనం కౌంటర్లను ఏర్పాటుచేస్తామన్నారు. మొత్తం 117 కౌంటర్లలో 500 మంది సిబ్బంది డెప్యుటేషన్‌పై విధులు నిర్వహించారని తెలిపారు.

సమష్టిగా పనిచేసి ఈ విధానాన్ని విజయవంతం చేసిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా జెఈవో ధన్యవాదాలు తెలియజేశారు. తమపై నమ్మకంతో పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా, ఐటి, శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, ట్రాన్స్‌పోర్టు, విజిలెన్స్‌, ఇంజినీరింగ్‌, రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, ప్రజాసంబంధాల విభాగం, ఎలక్ట్రికల్‌ విభాగాల అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Source