పంచారామ క్షేత్రాలు-అమరావతి అమరేశ్వరస్వామి ఆలయం


గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరాన ఉన్న అమరావతి గ్రామంలో అమరేశ్వరుని ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. నాలుగువైపులా మహోన్నతమైన గోపురాలతో విరాజిల్లే ఈ ఆలయం శ్రీ అమరేశ్వర స్వామి వారి నిలయం. చారిత్రక ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలం అమరావతి. కృష్ణవేణీ నదీ తీరములో త్రినేత్రుడైనస్వామివారు మూడు ప్రాకారములతో నిర్మించిన మహాక్షేత్రంలో కొలువుదీరి భక్తుల కోర్కొలు నెరవేస్తున్నారు. ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. 

తూర్పువైపు గాలిగోపురం నుంచి ఇరవై గజాల దూరంలో కృష్ణా ప్రవాహం వద్దకు పోవడానికి దారి ఉంది. దక్షిణం వైపు గాలిగోపురం ద్వారానే ఎవరైనా లోపలికి ప్రవేశించాలి. ఈ ప్రధాన గోపురం ఎదురుగా పెద్దవీధి(రాజమార్గం) ఉంది. కృష్ణానదిలో స్నానంచేసి శుభ్రమైన వస్త్రం ధరించి, అమరేశ్వరునికి చేతులెత్తి నమస్కరించి, దక్షిణ దిక్కు గాలిగోపురం నుంచి ప్రదక్షిణ రీతిలో బయలుదేరితే వరుసగా మనకు ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయుడు, రుద్రపాదము, జ్వాలాముఖీదేవి, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసుర మర్ధిని, కోసలేశ్వరుడు,వీరభద్రుడు తదితర దేవతామూర్తుల సాక్షాత్కారం లభిస్తుంది.

స్థల పురాణం

పూర్వం లోక కంటకుడైన తారకాసురుడనే రాక్షసునికి,  శివుని కుమారుడైన కుమారస్వామికి ఘోర యుద్ధం జరిగింది.  ఆ యుద్ధంలో ఎంతకూ కుమారస్వామి ప్రయత్నాలు ఫలించడంలేదు. శివుని ఆత్మలింగం ఆ రాక్షసుని మెడలో ఉండడమే ఇందుకు కారణమని తెలుసుకున్న కుమారస్వామి శివుని ప్రార్ధించి ఒక దివ్యాయుధాన్ని తారకాసురునిపై ప్రయోగించాడు. తారకాసురుని తలను ఐదు ముక్కుగా ఛేదించాడు. ఆ ఐదు ముక్కలు చెదిరి ఐదు ప్రాంతాల్లో పడ్డాయి. ఆ శివలింగములు పడిన చోట్లు ఆరామములుగా భాసిల్లుతున్నాయి. అందొక ఆరామమే అమరావతి. అమరావతి యందు పడిన లింగమును ఇంద్రుడు పాపపరిహారార్ధం పూజించి, అచటనే ప్రతిష్టించి ఆలయం కట్టించాడు. అదే అమరేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది.

కొండవీటి రెడ్డిరాజుపై విజయం సాధించిన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని దేవాలయానికి దానం ఇచ్చినట్టు ఇక్కడ ఉన్న రాజశాసనం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు తులాభారం తూగి తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచినట్లుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలవారి తులాభారం అనే పేరుగల మండపం, దాని ముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. కాలక్రమేణా ఈ ఆలయం అమరావతి సంస్థానాధీశులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి పాలనలోకి వచ్చింది. ఆ కాలంలోనే ఈ ఆలయం నేటి రూపం వహించి ప్రఖ్యాతి గాంచినది.

ఈ ఆలయం మూడు ప్రాకారాలు కలిగి ఉంది. వాటి మధ్య వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. తూర్పుముఖంగా ఉన్న  ఈ ఆలయం గర్భగృహం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా ఉంది. వాటిలో గర్భాలయంలో అమరేశ్వరస్వామి దర్శనమీయగా, మండపంలో స్వామివారికి ఎదురుగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి కాంస్య విగ్రహం, మండపం ఎడమ భాగంలో బాల చాముండేశ్వరీ అమ్మవారు, కుడి భాగాన కాళహస్తీశ్వరుడు, ముందు భాగాన సూర్యభగవానుడు దర్శనమిస్తారు. ఆవరణలో నైరుతిమూల శ్రీ మల్లేశ్వరస్వామి, వాయవ్యమూల కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యమూల వేణుగోపాల స్వామి, చండీశ్వరుడు, దక్షిణభాగాన కాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు.

అమరావతి ఆలయంలో శివలింగం  చాలా పొడవుగా ఉంటుంది. దానికి ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం ఈ శివలింగం పెరుగుతూ ఉండేదట. అందువల్ల గుడిని ఎప్పటికప్పుడు పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగు చెందిన అర్చకులలో ఒకరు స్వామిపై మేకు కొట్టారు. అంతటితో శివలింగం పెరుగుదల ఆగిపోయినది. ఈ కథనానికి నిదర్శనంగా తెల్లని శివలింగంపై ఎర్రని(నెత్తుటి) చారికను కూడా చూపిస్తారు. అవి మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలన్నమాట. ఈ లింగం మూడు అడుగుల చుట్టుకొలత, 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం పై అంతస్తులో శివలింగ భాగాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి అనుమతిస్తారు.