విజయవాడలో వైభవంగా శ్రీవారి కల్యాణం


శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారికి నిర్వహించిన కల్యాణోత్సవంలో విజయవాడ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో స్వామివారికి రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించే విధంగా టిటిడి విజయవాడలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి.

కల్యాణోత్సవం : సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు

హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక విలువలను కూడా టిటిడి ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని టిటిడి శ్రీనివాస కల్యాణాల ద్వారా కల్పిస్తోంది. దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ కల్యాణాలు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తున్నది.

కల్యాణోత్సవంలో భాగంగా సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వర కు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగియనుంది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన విజయవాడ పురజనం భక్తి పరవశంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణతో శ్రీవారి నమూనా ఆలయ ప్రాంతం మారుమోగింది.

Source