పోతన భాగవతంలో భారతీయ సాంస్కృతిక వైభవం

శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతం గ్రంథంలో భారతీయ సాంస్కృతిక వైభవం చక్కగా కనిపిస్తుందని టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జరిగిన పోతన భాగవతం సదస్సు గురువారం ముగిసింది. ఈ సందర్భంగా శ్రీమహాభాగవతం సరళవ్యాఖ్యాన సహిత గ్రంథం వ్యాఖ్యాతలను, సంపాదక మండలి సభ్యులు కలిపి మొత్తం 44 మంది పండితులను శ్రీవారి ప్రసాదం, శాలువతో ఘనంగా సన్మానించారు. పోతన భాగవతం గ్రంథాలను బహుమానంగా అందజేశారు. గ్రంథ ముద్రణ కోసం మొదటి నుంచి సేవలందించిన టిటిడి ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డా. నొస్సం నరసింహాచార్యను ఘనంగా సన్మానించారు. ఈ గ్రంథానికి చక్కటి చిత్రాలను అందించిన కీ.శే. బాపు కుటుంబ సభ్యులను సత్కరించారు.


ఉదయం జరిగిన సాహితీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన సమస్తమైన విషయాలు పోతన భాగవతం గ్రంథంలో ఉన్నాయని వివరించారు. సంస్కృతంలో ఉన్న వ్యాస భాగవతాన్ని ఇతర భారతీయ భాషల్లోకి అనువదించడం వల్ల ఆయా ప్రాంతీయ విశేషాలకు, గొప్ప వ్యక్తుల ఆదర్శాలకు కవులు సందర్భానుసారంగా స్థానం కల్పించినట్టు తెలిపారు. భాగవతంలో సత్యభామ పాత్రకు విశేషాదరణ రావడానికి దక్షిణాదిలోని ప్రాంతీయ పరిస్థితులే కారణమని వివరించారు.

సాహితీ సమావేశానికి అధ్యక్షత వహించిన ద్రవిడ వర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరి ”వేదవ్యాస, బమ్మెర పోతన భాగవతాలు” అనే అంశంపై ఉపన్యసించారు. సర్వేశ్వరత్వం, ధర్మసంస్థాపన, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, విశ్వశ్రేయస్సు, ఆనందమయం అనే అంశాలను ప్రధానంగా తీసుకుని పోతన భాగవతాన్ని రచించినట్టు తెలిపారు. ఇందులో అచ్చ తెలుగుతోపాటు అద్భుతమైన సంస్కృత సమాసాలు కూడా ఉన్నాయన్నారు. వ్యాస భాగవతంలో ఔచిత్యం కాని పలు అంశాలను పోతన తొలగించారని, అవసరమైన సందర్భాల్లో కొత్త అంశాలను చేర్చారని తెలిపారు. పోతన భక్తిపారవశ్యంతో మూలం కంటే ఎక్కువ పద్యాలు రాశారని వివరించారు.

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ పూర్వ కార్యదర్శి డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ”భాగవతం మానవీయ మూల్యాలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ ఇందులో మానవీయతకు సంబంధించిన గాథలు మెండుగా ఉన్నాయన్నారు. పెద్దలపై గౌరవం, భక్తిభావం, సమానత్వం, రాక్షసత్వ నిర్మూలన, స్నేహభావం, ఆపన్నులను ఆదుకోవడం తదితర అంశాలను ఆయా స్కంధాల్లో పొందుపరిచారని వివరించారు. ఆ తరువాత శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మ ”భాగవత పరమార్థం” అనే అంశంపై, డా. ఆర్‌.అనంతపద్మనాభరావు ”ధ్రువోపాఖ్యానం” అనే అంశంపై ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సప్తగిరి మాసపత్రిక ప్రధాన సంపాదకులు డా. కోటపాటి రాధారమణ, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. తాళ్లూరి ఆంజనేయులు, ప్రచురణల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Source