తిరుమలలో వేసవి సెలవుల అనంతరం కూడా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో భాగంగా జూలై 7వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా వారాంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో దివ్యదర్శనం(కాలినడక) టోకెన్లు రద్దు చేస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
తిరుమలలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులకు టిటిడి అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి చక్కటి సేవలందించారని తెలిపారు. ఇటీవల స్వామివారి దర్శనార్థం విచ్చేసే నడకదారి భక్తుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. సాధారణంగా గరుడసేవ, వైకుంఠ ఏకాదశి లాంటి ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే 50 వేల మందికిపైగా భక్తులు నడకదారిలో వస్తుంటారని, ఇటీవల సాధారణ రోజుల్లోనూ కాలినకడన అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పారు.
ఈ మధ్యకాలంలో ఎక్కువ రోజుల్లో రోజుకు 35 వేలకు పైగా కాలినడకన తిరుమలకు వస్తున్నారని, ఈ కారణంగా రద్దీ విపరీతంగా పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా జూలై 7 నుండి వారాంతంలో మూడు రోజుల పాటు దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేస్తామని, కొన్ని రోజుల పాటు పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాలినడక భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాలినడకన వస్తున్న భక్తులకు ఇస్తున్న ఉచిత లడ్డూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
Source