ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ఏప్రిల్ 5వ తేదీ నుండి 15 వ తేదీ వరకు జరుగనున్న శ్రీకోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు 5వ తేదీ అంకురార్పణ జరుగనుంది. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి జరుగనుండగా, 11వ తేదీ శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. భక్తుల రద్దీని పెట్టుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.
టిటిడిలోని వివిధ విభాగాల అధికారులు ప్రణాళిక బద్దంగా పనులు చేస్తున్నారు. 2015 నుండి ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
కల్యాణ వేదిక వద్ద భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలోను, ఆలయ పరిసర ప్రాంతాలలో మరింతగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, భక్తులు వీక్షించేలా ఎల్ ఈడీ స్క్రీన్ లను, అన్నప్రసాదాల పంపిణి, భక్తులకు స్వామివారి తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు
- 06.04.2025 (శ్రీరామ నవమి) – వృషభ లగ్నంలో ఉ. 9.30 – 10.15 గం.ల మధ్య ధ్వజారోహణం, సా.7 గం.లకు శేష వాహనం
- 07-04-2025 వేణుగాన అలంకారంలో హంస వాహనం
- 08-04-2025 వటపత్రసాయి అలంకారంలో సింహ వాహనం
- 09-04-2025 నవనీతకృష్ణ అలంకారంలో హనుమంత వాహనం
- 10-04-2025 మోహినీ అలంకారం గరుడసేవ
- 11-04-2025 శివధనుర్భాణ అలంకారంలో శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8.30 గం||లకు), గజవాహనం.
- 12.-04-2025 రథోత్సవం
- 13-04-2025 కాళీయమర్ధన అలంకారంలో అశ్వవాహనం
- 14-04-2025 చక్రస్నానం ధ్వజావరోహణం(రా|| 7 గం||)
- 15-04-2025 పుష్పయాగం(సా|| 6 గం||).