సప్తవర్ణ శోభితం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, ఆరు రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.