తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
టీటీడీ స్థానిక ఆలయాల్లో మంగళ వారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్పపల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహించారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు నిర్వహించారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు.
శ్రీ కోదండరామాలయంలో
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.