తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.
కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.