తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లసాక అన్నమాచార్యుల 515వ వర్థంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఊంజలసేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో తిరుమల గిరులు మార్మోగాయి.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీవన్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. తిరుమల శ్రీవారికి, అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ఎంతో అనుబంధం ఉందని, అదేవిధంగా అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఉన్నదని తెలిపారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు.

అహోబిలం శ్రీ ఉగ్రనరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. అన్నమయ్య సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం వినేందుకే ప్రతి ఏడాదీ ఇక్కడికి వస్తున్నట్లు తెలిపారు. టిటిడి అధికారులు భక్తిశ్రద్ధలతో అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అభినందించారు.

అనంతరం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు తిరుమలలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. రాబోవు రోజులలో వేలాది మంది కళాకారులతో అన్నమయ్య వర్ధంతి, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియచేశారు.

అంతకుముందు ఊంజలసేవ సందర్భంగా శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మ కడిగిన పాదము…ముఖారిరాగం, పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా….మోహనరాగం, గోవిందాశ్రిత గోకులబృందా పావన జయజయ పరమానందా….బహుదారి రాగంలో గానం చేశారు. కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు….హిందోళరాగం, నారాయణతే నమో నమో నారద సన్నుత నమోనమో….బేహాగ్‌రాగం, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యైము వీడు….కురంజి రాగంలో అలపించిన కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీరిలో టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, ప్రముఖ సంగీత గాయకులు కుమారి టి.శ్రీనిధి, శ్రీ ఎమ్‌.సుధాకర్‌, శ్రీ రంగనాధ్‌, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.

అనంతరం శ్రీ అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీవన్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.ఎనివాసరాజు శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అహోబిలం మఠం తరపున తిరుమల జెఈవోను, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణను సన్మానించారు. అనంతరం టిటిడి తరఫున తాళ్లపాక వంశీయులైన శ్రీ వేణుగోపాలాచార్యులు, శ్రీ నాగభూషణాచార్యులు, శ్రీహరినారాయణాచార్యులు, శ్రీరాఘవ అన్నమాచార్యులను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనంజయులు, ఏఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, భజన మండళ్ల సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Source