సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు ఎందుకు పెడతారు?

ఇంటిముందు కనిపించే రంగురంగుల ముగ్గులే రంగవల్లులు. సంక్రాంతి వచ్చిదంటే చాలు ఈ రంగవల్లులు ఇళ్లముందు అల్లుకుపోతాయి. ఈ రంగురంగుల రంగవల్లుల వెనుక బలమైన శాస్తీయ, సాంప్రదాయ నిర్వచనాలు ఉన్నాయి. ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటిలోని సంతోషాలకు అద్దం పడుతుంది. అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంటిలో లక్ష్మి అవాసం ఉంటుందంటారు. అదృష్టం ఆ యింటిని వరిస్తుందంటారు. ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గు ఇంటిలోకి దేవతలను ఆహ్వానించటానికి గుర్తుగా కూడా చెపుతారు పెద్దలు. ముగ్గులు ఎలా వేస్తారనేది ఏ తెలుగింటి అమ్మాయిని అగినా ఛటుక్కున చెప్పేస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాల్లో ఇంతగా ముడిపడి పోయి ఉన్న రంగవల్లుల వెనుక నిక్షిప్తమైన పరమార్ధం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

సనాతన కాలంనుండి ఇంటి ప్రధాన అలంకరణలలో రంగవల్లులు ఒకటిగా బాసిల్లుతున్నాయి. పురాణకథల ప్రకారం ఒకానొకప్పుడు ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. కాబట్టి, ఆ రాజు బ్రహ్మదేవుడిని తన కుమారుడిని బ్రతికించమని ప్రార్ధించాడు. దీర్ఘ తపస్సు తరువాత, బ్రహ్మదేవుడు బాలుడిని బ్రతికించటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో రాకుమారుడు యొక్క బొమ్మను గీయమని రాజుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి రాకుమారుడికి జీవం పోస్తానని చెప్పాడు. ఆ సమయం నుండి, రంగోలీ అన్నది జీవితం, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా ఉనికిలోకి వచ్చింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు ఎందుకు పెడతారు?

రంగవల్లులు


సంక్రాంతి నాడు వేసే ముగ్గులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ ధృక్పధాలున్నాయి. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం.

ఒక పద్ధతి ప్రకారం పెట్టబడే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం.

ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్య స్థానానికి సంకేతం.

ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి అంటే స్టాటిక్‌ ఫోర్స్‌, చుక్కలు గతిశక్తి అంటే డైనమిక్‌ ఫోర్స్‌కి సంకేతాలని నిర్వచిస్తున్నారు పెద్దలు. ఇక వివిధ ఆకారాలతో వేసే ముగ్గుల వివరాల్లోకి వెళితే విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ, పాము ఆకారము ఆశ్లేష నక్షత్రానికి, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా పురాణాల్లో నిర్వచించబడింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు ఎందుకు పెడతారు?

పండుగ చివరిరోజు  రధం ముగ్గు


పండుగల చివరిరోజు వేసే రధం ముగ్గు సామాజిక ఐక్యతను చాటి చెబుతుంది. మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

పండుగ రోజుల్లో ముగ్గులు, గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరం. మంగళకరం. అంతేకాదు మహిళలకు అది ఒక నిత్య వ్యాయామం. ముగ్గులోని సున్నపుపొడి వలన పరిసరాల్లో సూక్ష్మక్రిములు నశించి పిల్లాపాపలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పేడనీళ్ళు కళ్ళాపువేసి రకరకాల ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళను అలంకరించి రకరకాల రంగులను జల్లి ఆనందపడడం మనసుకు కళ్లకు ఆనందాన్నిస్తుంది.