‘మాత’ గా పిలిచే జీవి గోవు ఒక్కటే - అనంతం గోదాన ఫలితం


గోవు సకల దేవతా స్వరూపం, సమస్త దేవతలంతా గోవులోనే కొలువై వుంటారు. ఈ కారణంగానే గోమాతను పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు,కన్నతల్లి తరువాత గో 'మాత' గా పిలిపించుకునే ఏకైన జీవి ఒక్క ఆవు మాత్రమే. హిందూ ధర్మం అధికంగా గంగ గోవు గాయత్రిపై ఆధారపడి వుందని చెబుతారు. దీనిని బట్టి గోవు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి గోవును ఎవరికైనా దానం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో మూడు గోవులను దానం చేయాలనీ, ఈ విధంగా దానం చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయని స్పష్టం చేస్తోంది.

 గోదానం విశిష్టత

అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.
కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి న‌దీ గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శ‌పించాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు.

నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చ‌నిపొమ్మ‌ని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్న‌ట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.

శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

 గోవును దానం చేయడం వలన జన్మజన్మల పాపాలు హరించివేయబడతాయి. గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా మరణానంతరం 'వైతరణి' నదిని దాటే క్రమంలో అత్యంత కష్టతరమైన ప్రయాణం చేయకుండా ఈ పుణ్య ఫలం అడ్డుపడుతుంది. ఇక గోవును దానం చేయడం వలన, కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమ గతులను పొందుతారని చెప్పబడుతోంది.

 కపిలగోవు దాన ఫలం


ఇక కపిల గోవును అంటే నల్లని వర్ణంలో గల గోవును దానం చేయడం వలన ఈ ఫలితం మరింత త్వరగా లభిస్తుంది. గోవును దానం చేయడం వలన దారిద్ర్యం తొలగి సంపదలు కలుగుతాయి ... అనారోగ్యాలు - అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సమస్యలు తుడిచిపెట్టుకుపోయి సంతోషాలు చేకూరతాయి. గోవును దానం చేసిన ఫలితం తరాలపాటు ఆ కుటుంబానికి అందుతూ, వారి క్షేమానికి కారణమవుతూ వుంటుంది.