సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతమైన బ్రహ్మోత్సవాలు



అన్ని విభాగాల సిబ్బంది సమష్టి కృషితోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. నవంబరు 15 నుండి 23వ తేదీ వరకు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలోని ఫ్రైడే గార్డెన్స్‌లో వనమహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీఆకే రవికృష్ణ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటు బ్రహ్మోత్సవాలను విజయ వంతంగా నిర్వహించారని అభినందించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం చేసుకున్నారని తెలిపారు. అర్చకులు సమయపాలనతో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారని, మీడియా ప్రతినిధులతో పాటు భక్తులు చక్కటి సహకారం అందించారని తెలిపారు. ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌, ఆరోగ్య విభాగం, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలోని శ్రీవారి సేవకులు భక్తులకు మెరుగైన సేవలందించారని కొనియాడారు.

అనంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ వాహససేవలలో కళాబృందాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. మొదటి సారిగా కళాబృందాలకు సంచార మ్యూజిక్‌ సిస్టంను టిటిడి అందించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఆనంతరం వనమహోత్సవం నిర్వహించుకొవడం ఆనవాయతిగా వస్తుదని అన్నారు. అందులో భాగాంగ ఇక్కడ ఉద్యోగులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులకు అమ్మవారి ప్రసాదాలను అందిస్తున్నట్లు తెలిపారు.

అంతకు ముందు ఫ్రైడే గార్డెన్‌లో ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆనంతరం మహా నివేదన, వనమహోత్సవం, ప్రసాద వితరణ చేశారు.
Source