కాలినడక భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌


అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో శనివారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాలిబాట మార్గంలో మెట్లపై భక్తులు జారిపడకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఫిబ్రవరి నాటికి తిరుమలలో పూర్తిగా ఎల్‌ఇడి విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వెండి వాకిలి ప్రాకారంలోని శ్రీనివాసకల్యాణం చిత్రాలకు ప్రత్యేక లైట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు రిట్రాక్టబుల్‌ రూఫ్‌ ఏర్పాటుచేసి భక్తులకు వర్షానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. భక్తులు ప్రసాదాలు స్వీకరించే
ప్రాంతంలోని నీటికొళాయిల వద్ద పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు వేడినీటితో శుభ్రం చేసే ఆధునిక యంత్రాలను వినియోగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో క్యూలైన్లను అధ్యయనం చేసి భక్తులు సౌకర్యవంతంగా దర్శనానికి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సివిఎస్‌వోకు ఈవో సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ఇతర విభాగాల్లో జనవరి నాటికి ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తిరుమలకు వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఘాట్‌ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరకామణి విభాగంలో లెక్కింపు మినహా మిగతా పనులను పొరుగుసేవ (పనిని ఔట్‌సోర్స్‌) ద్వారా చేయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.