శ్రీవారి ఆశీస్సులతోనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యా :ఎం.వెంకయ్యనాయుడు


సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన తనకు భారతదేశంలోనే అత్యున్నతమైన, రాజ్యాంగబద్ధమైన రెండవ బాధ్యత అయిన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం శ్రీవారి ఆశీస్సులవల్లే వచ్చిందని, ఇది తన జీవితంలో మరచిపోలేని ఘట్టమని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల్లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తానని, ముందుగా కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. దేశప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. 8వ తరగతి చదువుకునే రోజుల నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాదీ తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నానని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం వల్ల మరింత ఉత్సాహం, ధైర్యం, స్వాంతన, స్ఫూర్తి, విశ్వాసం, వెలుగు వస్తుందన్నారు. 


ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నాక తనకు కొత్త వెలుగు కనిపించిందని, ఆ వెలుగును ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, శక్తివంతమైన దేశంగా మార్చేందుకు ఉపయోగిస్తానని తెలిపారు. ప్రతి వ్యక్తికీ దైవచింతన, భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికభావన ఉంటే మంచి వ్రవర్తన, సత్‌ బుద్ధి లభిస్తాయన్నారు. పండుగలు, పవిత్రరోజుల్లో తిరుమలకు వచ్చి భక్తులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. శ్రీవారి ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్నఎం.వెంకయ్యనాయుడుకు టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో కెఎస్‌.శ్రీనివాసరాజు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అటు తర్వాత టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.