శుభాలు కలిగించే తొలి ఏకాదశి

ఏమంచిపని ప్రారంభించినా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడటం పజలకు అలవాటు. ఏడాదిలో వచ్చే ఏకాశుల్లో తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి మనం ముఖ్యమైనవిగా భావిస్తాం.. ఇలా ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారుట.
ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు స్వయంగా ధర్మరాజుకు ఈ ఏకాదశి మాహాత్మ్యం వివరించాడని ఉంది....

ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

తొలి ఏకాదశి విశిష్టతలు

తొలిఏకాదశి ప్రకృతిలో జరిగే మార్పులకు సూచీగా చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి దక్షిణం వైపుకు మరలినట్లుగా ఆ రోజు దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక ఆదే రోజున చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభ మవుతుంది.

ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చాతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ఎటువంటి ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు, నిబంధనలు పాటిస్తారు. జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి పిండి చేసి ప్రసాదంగా తింటారు. పూర్వకాలం నుండి ఏకాదశినాడు ఉపవాసం ఉండాలన్న నియమం లోకంలో స్థిరపడింది.

ఏకాదశి రోజున శ్రీహరిని ఎలా పూజించాలి?

తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మాహాత్మ్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడ్డాయి. సమస్యలతో సతమతమవుతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్‌ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగల రనీ, మరణానంతరం వారికి వైకుంఠప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

తొలి ఏకాదశి

ఇది రైతుల పండుగ

అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని రైతులు తొలి ఏకాదశి నాడు ఆ శ్రీహరిని వేడుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపు పిండిని తప్పక తినాలని రైతులు విశ్వసిస్తారు. తొలి ఏకాదశి మహా పర్వదినం. మనసులో మంచి సంకల్పం ఉంచుకుని ఎటువంటి కార్యాన్ని ఈ రోజు తలపెట్టినా భవిష్యత్తులో శుభప్రదంగా ముందుకు సాగుతుంది. తొలి ఏకాదశి నాడు ఆ శ్రీమహా విష్ణువును మనసారా కొలిచి మీ ఇంట సుఖశాంతులు పొందాలని మా ఆకాంక్ష.