శివ పూజకు అరుదైన పుష్పం నాగమల్లి

నాగుపడగ, మధ్యలో శివలింగం ఉన్నట్టుగా, సువాసనలు వెదజల్లుతూ  ఉండే నాగమల్లి పుష్పం చూసేందుకు ఎంతో ముచ్చటగొలుపుతుంది . ఇది ఒక అరుదైన పుష్పం . అన్ని చెట్లకు, మొక్కలకు పువ్వులు కొమ్మలకు పూస్తే నాగమల్లికి మాత్రం నేరుగా కాండానికి పూవులు పూస్తాయి. ఈ పూలు మంచి సువాసన వెదజల్లుతూ నాలుగు నుండి వారం రోజుల పాటు వాడిపోకుండా ఉంటాయి. అయితే ఈ మొక్కను పాతే వ్యక్తులు బతికి ఉండరనే నానుడి ఎక్కువగా ఉండటంతో ఎవరూ ఈ చెట్టును తోటలో కానీ, ఉద్యానవనాల్లో కానీ పాతరు. పరమ శివునికి ఈ పూలంటే ఎంతో ప్రీతికరమని ఎక్కువగా ఈ పూలతోనే పూజలు చేస్తారు.

నాగమల్లి పువ్వులు ఎరుపు, నారింజ, రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిలోని కేసరాలు తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి. అందువల్లే ఈ పూలు పడగ విప్పిన నాగు పాములా కనబడుతుంటాయి. అయితే ఇంత అందమైన పూలను మహిళలు అలంకారం కోసం వినియోగించకపోవడం ఒక విశేషం. ఆయుర్వేద ఔషధాలలో విషానికి విరుగుడుగా ఈ చెట్టు ఆకులను,బెరడును,కాయలను ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధగుణాలు కలిగి ఉన్న నాగమల్లి కనుమరుగవుతున్న నేపధ్యంలో నాగమల్లిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

శివపూజకు అత్యంత శ్రేష్ఠం నాగమల్లి

శివలింగ పుష్పంతో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని.. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివ లింగ పుష్పాలను ఏ దేవునికైనా సమర్పించేటప్పుడు తలపై లేదా భుజ స్కంధాలపై మాత్రమే సమర్పించాలి. పార్వతీ దేవికి ఈ పుష్పాన్ని మాంగల్యంలో సమర్పించాలని పండితులు చెప్తున్నారు.

ప్రతిభాగంలోను శివుడు నెలకొని ఉండే నాగమల్లి చెట్టు 

నాగమల్లి పుష్పాలతో శివుని పూజించడం ప్రతి భక్తునికి ఒక వరం. ఈ పుష్పాలతో ఆయనను పూజించిన వారు జన్మ రాహిత్యాన్ని పొంది అంతిమమున కైవల్యం పొందుతారని శివ పురాణం చెబుతోంది. శివలింగ చెట్టుగా కూడా పిలువబడే నాగమల్లి చెట్టు ప్రతి భాగంలోనూ శివుడు నెలకొని ఉంటాడని విశ్వాసం. ఈ పుష్పాలు సర్వ దేవతలకు.. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. 

శివ లింగ వృక్షాలు ఎక్కువగా దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఉంటాయి. దీనిని నాగ లింగ వృక్షం అని కూడా అంటారు. ఈ పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం లాగా ఉంటుంది. ఈ పుష్పాలు పై భాగాన నాగపడగ కప్పినట్టు ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. 

ఈ పుష్పాలను నాగమల్లి, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఎంతో చక్కని పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ఈ పుష్పాలతో మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారికి.. సోమ, గురు, శనివారాల్లో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.